భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలకుడిగా బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలు గడిచిన తరుణంలో బీజేపీ యంత్రాంగం సంబరాలు జరుపుకుంటుంటే.. ప్రతిపక్షం కాంగ్రెస్ ఆగ్రహ జ్వాలలు వెలగ్రక్కుతోంది. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రోజును "విశ్వాసఘాత దినం"గా పేర్కొంది. ఈ క్రమంలో దేశంలోని 20 ప్రాంతాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మోదీ సర్కార్ ప్రజలను ఎలా మోసం చేసిందో ప్రజలకు గుర్తుచేయాలని వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులను, ప్రతినిధులను పార్టీ ఆదేశించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ సంఘ్వీ మొదలైనవారు భువనేశ్వర్, ముంబయి లాంటి చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి ఇప్పటికే సన్నద్ధమవ్వగా.. గులామ్ నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, రాజ్ దీప్ సుర్జేవాలా లాంటి కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే దేశ రాజధానిలో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.


ఈ క్రమంలో ఈ నాలుగేళ్ళ పాలనలో బీజేపీ ప్రభుత్వం కనబరిచిన ప్రతిభకు రాహుల్ గాంధీ ప్రోగ్రెస్ రిపోర్టు అందించారు. అందులో వ్యవసాయం, విదేశాంగ పాలసీలు, ఇంధనం ధరలు, ఉపాధి కల్పన మొదలైన అంశాలలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని తెలిపారు. కానీ అదే ప్రభుత్వం స్లోగన్స్ తయారు చేయడంలో ఏ ప్లస్ గ్రేడును, స్వయం ప్రచారం చేసుకోవడంలో ఏ ప్లస్ గ్రేడును, యోగాను ప్రచారం చేయడంలో బీ మైనస్ గ్రేడును పొందిందని రాహుల్ ట్వీట్ చేశారు.


ఈ రోజు పలువురు కార్యకర్తలు రాజధానిలో మోదీ సర్కారుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తలనీలాలు కూడా సమర్పించారు. కాగా, ఈ రోజు ఉదయమే ప్రధాని మోదీ తన నాలుగేళ్ళ పాలనను పురస్కరించుకొని దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. 125 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ధ్యేయంగా తాను ముందుకు వెళ్తున్నానని ఆయన తెలిపారు.