రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దుర్మరణం
తులసిగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సిద్దూ న్యమా గౌడ మృతి చెందారు.
కర్ణాటక: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తులసిగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సిద్దూ న్యమా గౌడ మృతి చెందారు. గోవా నుండి బాగల్‌కోట్ వచ్చే దారిలో ఈ దుర్ఘటన జరిగింది. సిద్దూ న్యమా గౌడ జమకంది అసెంబ్లీ నియోజకవర్గం నుండి తాజాగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన వయస్సు 69 సంవత్సరాలు.
మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో 222 స్థానాలకు మే 12న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈసీ ఫలితాలను మే 15న ప్రకటించింది. బీజేపీ 104 సీట్లను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించినా.. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా 78 సీట్లు సాధించిన కాంగ్రెస్, 37సీట్లు సాధించిన జేడీఎస్‌తో పొత్తు కుదుర్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేడీఎస్ఎల్పీ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. డిప్యూటి సీఎం పదవి కాంగ్రెస్ నేత జి.పరమేశ్వరకు దక్కింది. అనంతరం గవర్నర్ ముందు బలపరీక్షను ఎదుర్కొన్న కుమారస్వామికి 117 ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. కాగా ఎమ్మెల్యే సిద్దూ న్యమా గౌడ మృతితో కాంగ్రెస్ బలం 78 నుంచి 77కు పడిపోయింది. ఇదిలా ఉండగా వాయిదాపడ్డ ఆర్ఆర్ నగర్ అసెంబ్లీ స్థానానికి సోమవారం (మే 2,2018న), జయనగర స్థానానికి జూన్ 11న ఎన్నికలు జరగనున్నాయి.