కాంగ్రెస్ పార్టీ నేత, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ పాల్గొన్న ఓ ఎన్నికల ప్రచారం ర్యాలీలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాక్ అనుకూల నినాదాలు వినిపించడం ఆ పార్టీని ఇరకాటంలో పడేసింది. దీంతో ఏం చేయాలో అర్థం కాని కాంగ్రెస్ పార్టీ.. ఈ వీడియోను ప్రసారం చేసిన జీ న్యూస్‌పైనే ఎదురుదాడి మొదలుపెట్టింది. జీ న్యూస్ ఓ ఫేక్ వీడియోను ప్రసారం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ మీడియా సంస్థ డీఎన్ఏ ఈ వివాదంపై జీ న్యూస్ ఎడిటర్-ఇన్-చీఫ్ సుధీర్ చౌదరితో మాట్లాడి పలు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది.
ప్ర: జీ న్యూస్ ఛానెల్ ఓ ఫేక్ వీడియోను ప్రసారం చేసిందని, వాస్తవానికి ఎన్నికల ర్యాలీలో ఎవ్వరూ పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలను చేయలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ఆరోపణలో వాస్తవం వుందా ?
జవాబు: జీ న్యూస్ ప్రసారం చేసిన వీడియో వాస్తవమైనదే. ఆ వీడియోను ఫేక్ అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ ర్యాలీకి సంబంధించి జీ న్యూస్ వద్ద 7 రికార్డింగ్ ఫుటేజీలు ఉన్నాయి. ప్రతీ ఫుటేజీలోనూ పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. అది కూడా ప్రతీ వీడియోలోనూ ఒకే సమయంలో ఆ నినాదాలు వినిపిస్తున్నాయి. ఇక అందులో వాస్తవం లేదు అనడానికి ఏముంది. అయినా అడ్డంగా బుక్ అయిన ప్రతీసారి అది ఫేక్ వీడియో అని ఆరోపించడం కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓ పరిపాటిగా మారింది. ఆ పార్టీ నేతలకు సైతం తప్పు చేసిన నేతలకే మద్దతు పలకడం అలవాటైపోయింది.
ప్ర: తాను పాల్గొన్న ర్యాలీలో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు ఎవ్వరూ చేయలేదని ఖండించే క్రమంలో నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఉపయోగించిన పదజాలంపై మీరు ఏమని స్పందిస్తారు ?
జవాబు: నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఉపయోగించిన పరుష పదజాలం తీవ్ర అభ్యంతరకరమైనది. భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై తమకు విశ్వాసం ఉందని కాంగ్రెస్ పార్టీ తరచుగా చెప్పుకుంటూ వస్తోంది. కానీ దేశంలోనే అతి ప్రాచీనమైన ఆ పార్టీకి చెందిన నేతలు మాట్లాడే తీరు మాత్రం మీడియా గొంతు నొక్కేదిగా ఉంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతల తీరు వారి వైఖరికి పరాకాష్టగా మారింది.
ప్ర: ఈ వివాదంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (భారత సంపాదకుల మండలి) స్పందించలేదు కదా!! మరి మీ తర్వాతి కార్యాచరణ ఎలా ఉండబోతుంది ?
జవాబు: దేశ ప్రజాస్వామ్య విలువలపై జీ న్యూస్‌కి ఎల్లప్పుడూ విశ్వాసం ఉంది. న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. న్యాయం జరిగేందుకు చట్టరీత్యా చేయాల్సిన పోరాటం చేస్తాం. ఇప్పటికే న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాం. భారత ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేశాం. ఇంకా అవసరమైతే కోర్టుకైనా వెళ్తాం. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టపరమైన పోరాటం చేయడానికే సిద్ధంగా ఉన్నాం.
ఎడిటర్స్ గిల్డ్ ఇంకా స్పందించకపోవడం బాధాకరమే. అయితే, మేము తీసుకున్న ఈ నిర్ణయానికి దేశంలోని అధిక శాతం మీడియా సంస్థల నుంచి మద్దతు లభిస్తుందని మాత్రం ఆశిస్తున్నాం. ఇది కేవలం ఒక జీ న్యూస్ చేస్తున్న పోరాటంగా చూడకూడదనేది నా ఉద్దేశం. దీనిని మొత్తం మీడియా చేస్తు్న్న న్యాయపోరాటంగా పరిగణించాలి.
ప్ర: కేవలం సిద్ధూ తనంతటా తానుగా ఇదంతా చేస్తున్నారా ? లేక సిద్ధూకు ఆయన పార్టీ నుంచి మద్దతు ఉందంటారా ?
జవాబు: కాంగ్రెస్ లాంటి ఒక పెద్ద పార్టీలో సిద్ధూ లాంటి నేత ఒకరు తమంతట తాము ఒంటరిగా ఏదీ చేయలేరు. ఇంకా చెప్పాలంటే సిద్ధూ పాకిస్తాన్ వెళ్లినప్పుడు అందుకు పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఒప్పుకోలేదు. కానీ సిద్ధూ మాత్రం తనకు కెప్టేన్ అమరిందర్ సింగ్ కాదు.. రాహుల్ గాంధీ అని ప్రకటించారు. అయితే, అప్పుడు సిద్దూ అభిప్రాయంతో విభేదించిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయన వైఖరికి మద్దతుగా నిలిచారు. ఇదంతా చూస్తోంటే నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ వెనక ఎవరున్నారనేది ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.