యాడ్ ఏజెన్సీ విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోని కాంగ్రెస్ పార్టీ
యాడ్ ఏజెన్సీ విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోని కాంగ్రెస్ పార్టీ
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఖరారు వ్యూహాల్లో తలమునకలైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కీలకమైన యాడ్ ఏజెన్సీ విషయంలో ఇంకా ఓ స్పష్టతకు రాలేదు. ఇప్పటివరకు 12 కంపెనీల వద్ద ప్రజంటేషన్స్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అందులోంచి బ్రాండ్‌స్కోప్ అనే సంస్థను రెండోసారి, గ్రాఫిక్ గోల్డ్ అనే సంస్థను మూడోసారి ప్రజంటేషన్ కోసం పిలిపించుకున్నట్టు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఏదైనా ఒక యాడ్ ఏజెన్సీని కాంగ్రెస్ పార్టీ ఎంచుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ విషయంలో అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లేదా ఇటు యాడ్ ఏజెన్సీ వర్గాల నుంచి ఈ విషయంలో ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ కమిటీ యాడ్ ఏజెన్సీల ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. 2014 ఎన్నికల్లో డెంట్సు ఇండియా యాడ్ ఏజెన్సీ కాంగ్రెస్ పార్టీకి మీడియా క్యాంపెయిన్ బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలు ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమై మే 19 వరకు మొత్తం ఏడు దశల్లో పూర్తికానుండగా మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.