ఢిల్లీ: తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కాదని.. ఈ విషయంలో తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. పార్టీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న ఆలోచనను పునఃపరిశీలించాలని కోరుతూ బుధవారం కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యులు తనను కలిసిన సందర్భంగా రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ అవలంభించాల్సిన విధానాలపై చర్చించేందుకు బుధవారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకురాలు సోనియా గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం తమిళనాడు నుంచి వచ్చిన కొంతమంది పార్టీ ఎంపీలు పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే కొనసాగాలని కోరారు. అది చూసిన మిగతా ఎంపీలు సైతం వారితో కలిసి రాహుల్ గాంధీనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఒక తీర్మానం చేయాల్సిందిగానూ పార్టీ ఎంపీలు అభిప్రాయపడ్డారు.


అయితే, ఈ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ స్పష్టంచేసినట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా తన స్థానంలో మరొకరిని నియమించాలని మే 25న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనే రాహుల్ గాంధీ సీడబ్ల్యూసీని కోరిన సంగతి తెలిసిందే.