తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుండి రాహుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఉదయం బూత్ స్థాయి కమిటీ అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం పార్టీ నేతలతో విడివిడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ కేసీఆర్ పాలన, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాల గురించి ఆరా తీసినట్లు సమాచారం. అనంతరం హైదరాబాద్ లో వివిధ మీడియా ఎడిట‌ర్లతో రాహుల్ సమావేశమయ్యారు. బీజేపీ హయాంలో పత్రికలు, జర్నలిస్టులపై దాడులు పెరిగాయని.. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహుల్ మాట్లాడుతూ, తాను ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని.. మోదీకి కాదని చెప్పారు. లోక్‌సభలో తాను మోదీని కౌగిలించుకోవడం ఆయనకు నచ్చలేదని.. మోదీ ప్రత్యర్థులను గౌరవించరన్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. 2019లో మోదీ ప్రధాని అయ్యే అవ‌కాశం లేదని.. బీజేపీకి 230సీట్లు రాకుంటే మోదీ ప్రధాని కాలేర‌ని తెలిపారు. ఈ సమావేశంలో ఆయన పెళ్లిపై కూడా స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో నా వివాహం అయిపోయిందని చెప్పారు.


అటు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని.. ఏపీలో పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరికాసేపట్లో ఆయన పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు.