ఫోన్ కాల్ ఆడియో లీక్ చేసి బీజేపీకి గట్టి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
బీజేపీకి గట్టి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
తెల్లవారితే కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి వుండగా అంతకన్నా ముందుగా బీజేపీకి కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఫోన్ చేసిన బీజేపీ నేతలు వారితో బేరసారాలకు దిగుతున్నారంటూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఓ ఆడియో క్లిప్‌ను మీడియాకు విడుదల చేసింది. సీఎం యడ్యూరప్ప తరపున గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉగ్రప్ప మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ ఆడియో క్లిప్పును విడుదల చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ఆరోపణలపై స్పందించిన బీజేపీ.. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఆడియో క్లిప్ ఫేక్‌ది అని కొట్టిపారేసింది.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉగ్రప్ప మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. రాయచూర్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే బసన్న గౌడకు ఫోన్ చేసిన గాలి జనార్థన్ రెడ్డి " ముఖ్యమంత్రి యడ్యూరప్పకు మద్దతు ప్రకటిస్తే, నీ లైఫ్‌సెటిల్ చేస్తా. రూ. 150 కోట్లతోపాటు మంత్రి పదవి కూడా వచ్చేలా ఏర్పాటు చేస్తాను" అని చెప్పారని తెలుస్తోంది. పాత విషయాలు మరిచిపోయి బీజేపీతో చేతులు కలిపితే.. ఆ తర్వాత మీకు ఏం కావాలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షానే నేరుగా మీతో మాట్లాడుతారు. శివన్నగౌడ గతంలో నా మాట వినే మంత్రి అయ్యారని... రాజీవ్ గౌడ నా వల్లే అభివృద్ధి చెందారని చెబుతూ బసన్న గౌడను ప్రలోభపెట్టేందుకు యత్నించారని ఉగ్రప్ప ఆరోపించారు.
గాలి జనార్థన్ రెడ్డి ఫోన్ కాల్ కి స్పందించిన బసన్న గౌడ్.. ‘మీపై గౌరవం ఉంది. కానీ, కాంగ్రెస్‌కు నమ్మక ద్రోహం చేయలేను’ అని బదులిచ్చినట్టు ఉగ్రప్ప మీడియాకు తెలిపారు. ఇదే విషయాన్ని స్పష్టంగా వెల్లడిస్తూ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఓ ట్వీట్ కూడా చేసింది.