తమ సమస్యలను వెంటనే తీర్చాలని రైతులు చేపట్టిన కిసాన్ ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. రైతుల రుణమాఫీ అమలు, విద్యుత్‌ టారిఫ్‌ తగ్గించడం, స్వామినాథన్‌ సిఫార్సులను వెంటనే అమలు చేయాలనే డిమాండ్లతో రైతులు ఢిల్లీ ముట్టడికి యత్నించారు. హరిద్వార్ నుండి సుమారు 70వేల మంది రైతులు 'కిసాన్‌ క్రాంతి పాదయాత్ర'గా బయల్దేరి ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలపాలని అనుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ ఈ ర్యాలీ లోనికి ప్రవేశించకుండా పోలీసులు ఢిల్లీ సరిహద్దు వద్ద అడ్డుకున్నారు. యూపీ మంత్రులు రైతులను బుజ్జగించే ప్రయత్నం చేసినా.. రైతులు మంత్రుల మాట వినలేదు. వారు ఢిల్లీ వైపు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. దీంతో పోలీసులు జాతీయ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఢిల్లీ లోపలికి ప్రవేశించకుండా అక్కడి నుంచి తరిమికొట్టడానికి వారిపైకి వాటర్‌ కెనాన్లను, బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కాగా గాంధీ జయంతి రోజున రైతులపై పోలీసులు ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


రైతుల కిసాన్‌ క్రాంతి ర్యాలీకి విపక్షాలు మద్దతు తెలిపాయి. యూపీ మాజీ మంత్రి అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ తదితరులు మద్దతిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు మనల్ని పాలించిన బ్రిటిష్‌ ప్రభుత్వానికి ప్రస్తుత ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదని స్పష్టమైందని కాంగ్రెస్‌ నాయకుడు రణ్‌దీప్‌ సుర్జీవాలా అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్‌ ప్రభుత్వం రైతులను దోచుకుందని, ప్రస్తుత మోదీ సర్కార్‌ రైతులపై టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ పేలుస్తోందని ఆయన చెప్పారు.


తమ డిమాండ్ల సాధన కోసం ర్యాలీగా వస్తున్న రైతులను ఢిల్లీలోకి అనుమతించాలని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. రైతులను ఎందుకు రానివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. రైతులను ఢిల్లీలోకి రానివ్వకపోవడం శోచనీయమన్న ఆయన.. తాము రైతుల పక్షాన ఉన్నామని చెప్పారు.