ఆర్ధిక మంత్రి ప్రకటనతో రికార్డు స్థాయిలో ఎగబాకిన నిఫ్టీ !!
అప్పటి వరకు తీవ్ర ఒడిదొడుకుల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఆర్ధిక మంత్రి ప్రకటనతో ఒక్కసారిగా భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి.
ముంబై: దేశీయ సంస్థలకు కార్పోరేట్ పన్ను శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ ప్రభావం స్టాక్ మార్కెట్ పై స్పష్టంగా కనిపించింది. అప్పటివరకు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు...కేంద్రం నిర్ణయంతో ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఆర్దిక మంత్రి ప్రకటన అలా వచ్చిందో లేదో... తీవ్ర ఒడిదొడుకుల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి.
స్టాక్ మార్కెట్ గ్రాఫ్ ను పరిశీలించినట్లయితే మధ్యాహ్నం 12 గంటలకు సెన్సెక్స్ 1700 పైగా లాభపడి 38 వేల పాయింట్ల దరిదాపులకు చేరుకుంది. అలాగే నిఫ్లీ 500 పాయింట్లకు పైగా లాభపడి 11 వేల పాయింట్ల వద్దకు చేరుకుంది. గత పదేళ్లలో ఇంత తక్కువ వ్యవధిలో నిఫ్టీ ఈ మేరకు లాభపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
స్టాక్ మార్కెట్ గ్రాఫ్ సాయంత్రానిల్లా మరింత దూసుకెళ్లే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే జీఎస్టీ కౌన్సిల్‌లోనూ కేంద్రం కార్పొరేట్లకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే మార్కెట్లు మరింత పైకి ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.