ఆంధ్రప్రదేశ్/నెల్లూరు/శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది.  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 4.56 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌8 రాకెట్‌ ద్వారా జీశాట్‌-6ఏ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసింది. అందుకోసం బుధవారం మధ్యాహ్నమే కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.
 
షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోనున్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌08 రాకెట్‌ మూడు దశల్లో తనలో అనుసంధానమైన జీశాట్‌-6ఏ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి తీసుకుపోనుంది. కమ్యూనికేషన్‌ వ్యవస్థను మరింత ప్రతిష్టపరచడానికి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ రాకెట్‌ 415 టన్నులు బరువు, 49.1 మీటర్లు పొడవు ఉంది. జిశాట్‌ ఉపగ్రహం పదేళ్ల పాటు తన సేవలందిస్తుంది. జిఎస్‌ఎల్‌వి ప్రయోగంలో ఇది పన్నెండవది. భూమికి దూరంగా 35,975 కిలోమీటర్లు, 20.61 డిగ్రీల వాలులో జిశాట్‌ -6ఎ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. మొబైల్‌ కమ్యునికేషన్‌లో ఇది విప్లవాత్మక మార్పు తీసుకొస్తుంది. దేశంలోని మొబైల్‌ కమ్యునికేషన్‌ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేయడానికి ఇది దోహదపడుతుంది.  గతంలో అనేక ప్రయోగాలను పర్యవేక్షించిన డాక్టర్‌ ఎన్‌.శివన్‌ ఛైర్మన్ హోదాలో నేడు తోలిపరిక్ష ఎదుర్కొబోతున్నారు.