Ambedkar statue : కేంద్ర మంత్రి పూలమాల వేసిన అంబేద్కర్ విగ్రహానికి గంగాజలంతో శుద్ధి!
కేంద్ర మంత్రి పూలమాల వేసి నివాళి అర్పించడంతో డా బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం అపవిత్రమైపోయిందని ఆగ్రహం వ్యక్తంచేస్తూ సీపీఐ, ఆర్జేడి నేతలు ఆ విగ్రహానికి పవిత్ర గంగా జలంతో శుద్ధి చేసిన ఘటన బీహార్‌లోని బెగుసరాయిలో చోటుచేసుకుంది.
న్యూ ఢిల్లీ: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పూలమాల వేసి నివాళి అర్పించడంతో డా బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం అపవిత్రమైపోయిందని ఆగ్రహం వ్యక్తంచేస్తూ సీపీఐ, ఆర్జేడి నేతలు ఆ విగ్రహానికి పవిత్ర గంగా జలంతో శుద్ధి చేసిన ఘటన బీహార్‌లోని బెగుసరాయిలో చోటుచేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా బెగుసరాయిలో శుక్రవారం జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. అక్కడే అంబేద్కర్ పార్కులో ఉన్న విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అయితే, అదే సమయంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత రెండు వారాల నుంచి నిరసన వ్యక్తంచేస్తూ బెగుసరాయిలో దీక్ష చేపట్టిన పలువురు సీపీఐ, ఆర్జేడీ నేతలు.. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ర్యాలీని తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే శనివారం గంగాజలంతో అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న సీపీఐ, ఆర్జేడీ నేతలు.. గంగా జలంతో విగ్రహాన్ని శుద్ధి చేశారు. జై భీమ్, జై పూలె నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు. దాదాపు రెండు వారాలుగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దీక్షలో పాల్గొంటున్న స్థానిక సీపీఐ నేత సరోజ్ సింగ్, ఆర్జేడీ నేతలు వికాస్ పాశ్వాన్, రూప్ నారాయణ్ ఈ విధంగా కేంద్ర మంత్రి పర్యటనపై తమ నిరసన వ్యక్తంచేశారు.
2015లో ఏర్పడిన బీహార్ రాష్ట్ర ప్రభుత్వం పదవీ కాలం ఇదే ఏడాది నవంబర్ 29న ముగియనుంది. దీంతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు అంతకంటే ముందుగా అక్టోబర్‌లోనే బీహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్‌లో చోటుచేసుకుంటున్న ఈ తరహా పరిణామాలు రాజకీయంగా చర్చనియాంశమవుతున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..