హర్యానాలోని మనోహర్ లాల్ ఖత్తర్ ప్రభుత్వం ఓ కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలికలను ఎవరైనా రేప్ చేస్తే.. అటువంటి వారికి మరణశిక్ష విధించేలా చట్టాన్ని రూపొందించాలని చూస్తోంది. అలాగే ఈ క్రమంలో ఇలాంటి రేప్ కేసులు నమోదు అయినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు సాధ్యమైనంత త్వరగా తీర్పును వెలువరించేందుకు కూడా చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది.


ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు బాగా పెరుగుతున్నందున వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఇలాంటి చట్టాలు తీసుకురావాల్సి ఉందని హర్యానా సీఎం ఖత్తార్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి కేసుల్లో పిల్లలపై అత్యాచారం చేసేవారు బంధువులో లేదా స్నేహితులో కావడం ఆయన దారుణమన్నారు. ఈ క్రమంలో ఈ కేసుల్లో కొన్నిసార్లు అసత్యప్రచారం కూడా జరిగే అవకాశం ఉందని.. అందుకే పూర్తిస్థాయి పరిశీలన బాధ్యతలను పోలీసు శాఖ నిర్వర్తించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. గత సంవత్సరం ఆరేళ్ళ పసిబాలికను కొందరు అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో నిందితులు ఆమెకు పరిచయస్తులే కావడం గమనార్హం. అయితే ఈ చట్టం ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉందో వేచి చూడాల్సిందేనని అంటున్నాయి పలు ప్రజాసంఘాలు.