పౌరసత్వ సవరణ చట్టం నిరసనలు..  దేశ రాజధాని ఢిల్లీలో 17 మందిని బలిగొన్నాయి. మూడు రోజులుగా ఢిల్లీలోని పలు ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. పౌరసత్వ సరవణ చట్టం నిరసనకారులు, సమర్థించే వారి మధ్య చెలరేగిన ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల ఘర్షణలో 150 మందికి పైగా గాయపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలోని జఫ్రాబాద్, మౌజ్ పూర్, చాంద్ బాగ్, భజన్ పురా ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. రెండు వర్గాల వారు రాళ్లు రువ్వుకోవడంతోపాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పెట్రోలు బంకులు కాల్చేశారు. ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 17కు చేరింది. వంద మందికి పైగా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పరిస్థితిని సమీక్షించారు. ఈ రోజు కూడా చాలా  ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంచారు.  గజియాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చే రోడ్లను బారికేడ్లతో మూసివేశారు. ఈ రోజు ఢిల్లీలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 


మరోవైపు ఢిల్లీలో చెలరేగిన  హింసపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఢిల్లీలో హింస చెలరేగడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. ప్రపంచం భారత్‌ను నిత్యం గమనిస్తోందని.. మన మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు.