2012 నాటి నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఇప్పటికి న్యాయం జరిగింది. నిందితులను ఇప్పటికే దోషులుగా తేల్చి ఉరి శిక్ష ఖరారు చేసినప్పటికీ... ఉరి శిక్ష అమలు చేయడంలో ఆలస్యమైంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిర్భయ తల్లిదండ్రులు గత ఏడేళ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. వారికి డెత్ వారెంట్ విడుదల చేయాలని కోరుతూ దాదాపు నెల రోజుల కిందట పాటియాలా హౌజ్ కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ పలుమార్లు వాయిదా పడిన తర్వాత ఈ రోజు తుది తీర్పు వెలువడింది. నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు తేదీని కోర్టు ప్రకటించింది. వారికి జనవరి 22న ఉదయం 7 గంటలకు ఉరి శిక్ష అమలు చేయాలని తీర్పు చెప్పింది. ఐతే ఈలోగా వారికి కావాల్సిన న్యాయ పరిమితులను ఉపయోగించుకునేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది. అంటే ఈ రెండు వారాల్లోగా న్యాయ పరిమితులు ఉపయోగించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: నిర్భయ భయానక ఘటన రోజు ఏం జరిగింది?


నిర్భయ తల్లిదండ్రుల హర్షం 


నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు తేదీని కోర్టు ప్రకటించడంపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు తమ కూతురుకు న్యాయం జరిగిందని నిర్భయ తల్లి భావోద్వేగభరితంగా అన్నారు. వారిని ఉరి తీయడం ద్వారా  దేశంలోని మహిళలకు సాధికారత లభిస్తుందని తెలిపారు. న్యాయవ్యవస్థపై నమ్మకం కలుగుతుందని చెప్పారు. కోర్టు వెలువరించిన తీర్పు చాలా సంతోషాన్నిచ్చిందని నిర్భయ తండ్రి తెలిపారు. ఇలాంటి నేరాలు చేయాలంటే భయపడేలా కోర్టు తీర్పు చెప్పిందన్నారు.


క్యూరేటివ్ పిటిషన్ వేస్తాం


మరోవైపు నిర్భయ కేసులో దోషుల తరఫున వాదిస్తున్న న్యాయవాది..  కోర్టు సమయం ఇచ్చినందున క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. న్యాయ పరిమితులను ఉపయోగించుకునేందుకు.. దోషులకు కోర్టు రెండు వారాలు గడువు ఇచ్చిందన్నారు.