ఢిల్లీ ఎన్నికలు: ఓటింగ్ ప్రారంభం.. పోటెత్తుతున్న ఓటర్లు
ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఢిల్లీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం 8 గంటలకు ఓటింగ్ మొదలైంది. ఢిల్లీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచే ఢిల్లీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటుండటం గమనార్హం. మరోవైపు ఓటర్ల కోసం ఢిల్లీ మెట్రో సర్వీసులు నేడు ఉదయం 4 గంటలకు ప్రారంభమయ్యాయి, దీంతో ఓటర్లు సులువుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకునే అవకాశం లభించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఢిల్లీ ఓటర్లు మరోసారి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు పట్టం కడతారా, లేక బీజేపీ వైపు మొగ్గు చూపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. షాహీన్ బాగ్ పరిధిలోని 5 పోలింగ్ కేంద్రాలను సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా ఎన్నికల అధికారులు గుర్తించారు.
Also Read: ఢిల్లీలో మహిళా ఎస్ఐ దారుణహత్య
మొత్తం 668 మంది అభ్యర్థులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. దాదాపు కోటి 47 లక్షల మంది ఓటర్లు తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 13,750 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరగనుంది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ప్రచారం అధికంగా వివాదాలకు కేంద్రమైంది. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టదిట్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 190 కంపెనీల సీఆర్పీఎఫ్, 19 వేల హోంగార్డులు, 42 వేల మంది స్థానిక పోలీసులను నియమించినట్లు ఢిల్లీ పోలీసు స్పెషల్ కమిషనర్ ప్రవీర్ రంజన్ వెల్లడించారు.