అబద్ధాలకోరులకు `కేజీవ్రాల్ అవార్డు` ఇస్తా: బీజేపీ నేత
ఢిల్లీకి చెందిన బీజేపీ అధికార ప్రతినిధి తేజీందర్ పాల్ సింగ్ బగ్గా ఓ చిత్రమైన అవార్డును తాను ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఢిల్లీకి చెందిన బీజేపీ అధికార ప్రతినిధి తేజీందర్ పాల్ సింగ్ బగ్గా ఓ చిత్రమైన అవార్డును తాను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. "కేజ్రీవాల్ అవార్డు" పేరుతో తాను ఇచ్చే అవార్డుకి అబద్ధాల కోరులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని.. అందుకోసం తమ పేరు, వివరాలను 9115929292 కి ఎస్సెమ్మెస్ చేయమని ఆయన బహిరంగ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
తన ప్రతిపక్ష పార్టీలపై నిరాధార ఆరోపణలు చేస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరిట ఈ అవార్డును అందించాలని భావించామని.. కేజ్రీవాల్ ప్రపంచంలోనే పెద్ద అబద్ధాలకోరని ఈ సందర్భంగా తేజీందర్ బగ్గా తెలిపారు. ఈ కేజ్రీవాల్ అవార్డుకి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని.. అందరి కంటే చక్కగా అబద్ధాలు చెప్పేవారిని తాము ఎంపిక చేసి వారికి కేజ్రీవాల్ అవార్డుతో పాటు రూ.5100 నగదు కూడా బహుమతిగా ఇస్తామని తేజీందర్ బగ్గా పేర్కొన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజధాని వాసులను ఎలా మభ్యపెట్టారో.. అందుకోసం ఎలాంటి అసత్య ప్రమాణాలు చేశారో తనకు తెలుసని.. అందుకే ఆయన పేరు మీదుగానే ఈ అవార్డును ప్రారంభించానని బగ్గా అన్నారు. కేజ్రీవాల్ రాజధాని వాసులకు ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తారని.. అలాగే డీటీసీ బస్సుల్లో మహిళలకు ప్రత్యేక సెక్యూరిటీ అమలు చేస్తానని చెప్పారని.. అలాగే ఢిల్లీలో 500 కొత్త పాఠశాలలు, 20 కళాశాలలు ప్రారంభిస్తానని చెప్పారని.. అయితే ఆ హామీలేవీ ఆయన నెరవేర్చలేదని తేజీందర్ అన్నారు. అందుకే ఆడిన మాటలు తప్పినందుకు గాను ఆయన పేరు మీద అసత్యాలు విపరీతంగా చెప్పేవారిని ఎంపిక చేసి కేజ్రీవాల్ అవార్డు ఇవ్వాలని భావిసున్నట్లు తెలిపారు