‘యాంటీ స్మోగ్ గన్’ను ప్రయోగించడం ద్వారా దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించవచ్చని కేజ్రీవాల్ ప్రభుత్వం అంటోంది. తొలుత ఈ గన్స్‌‌ను ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. క్లౌడ్ టెక్ సంస్థకు చెందిన ఈ యాంటీ స్మోగ్ గన్స్‌ను తొలుత నగరంలోని నీటి ట్యాంకర్లతో కనెక్ట్ చేస్తారు. ఈ గన్స్ ద్వారా 50 మీటర్ల ఎత్తు నుండి నీటి ధారలు వెలువడి కాలుష్యతెరల విడదీస్తాయి. ఈ యాంటీ స్మోగ్ గన్స్ వాడడం వల్ల వాతావరణంలోని ధూళికణాలు తగ్గుముఖం పడతాయని.. పలు దేశాలలో ఇది ఇప్పటికే ఆచరణలో ఉన్న పద్ధతని ఆప్ ప్రభుత్వం తెలిపింది.


ఈ యాంటీ స్మోగ్ గన్స్‌ని ఆనంద్ విహార్ ప్రాంతంలో ఢిల్లీ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ స్వయంగా పరీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీ కాలుష్య నివారణ శాఖ సంయుక్తంగా ఈ పరీక్షా కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ యాంటీ స్మోగ్ గన్స్‌తో పాటు నగరంలోని మెజారిటీ వాహనాలకు విద్యుత్ బ్యాటరీలు కూడా అమర్చాలని కూడా మంత్రి తెలిపారు. తొలుత సెక్రటేరియట్‌లో డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ శిశోడియా ఈ స్మోగ్ గన్స్‌ని దగ్గరుండి పరీక్షించారు. అయితే ఈ స్మోగ్ గన్స్ ఎలాంటి ప్రభావం చూపించలేదని ఆ తర్వాత వచ్చిన వాతావరణ రిపోర్టులు తెలపడం గమనార్హం.