న్యూఢిల్లీ: రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆప్ పార్టీకి ఊరట లభించింది. అనర్హత వేటుపడిన ఆమ్‌ ఆద్మీపార్టీ 20 మంది ఎమ్మెల్యేలకు ఢిల్లీ హైకోర్టు ఊరట నిచ్చే ఉత్తర్వులను జారీచేసింది. ఎలక్షన్ కమిషన్ సిఫారసులను పక్కనపెడుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. లాభదాయక పదవుల్లో కొనసాగుతున్న వీరిపై అనర్హత వేటువేయాలన్న ఎన్నికల సంఘం సిఫారసులను రాష్ట్రపతి కోవింద్ ఆమోదించగా.. ఆప్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయస్థానం ఎమ్మెల్యేలకు మద్దతుగా తీర్పు వెల్లడించింది.


 'ఈసీ నిర్ణయం సహేతుకం కాదు. ఇక్కడ సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించింది. అనర్హత నిర్ణయానికి ముందు, ఎమ్మెల్యేల వాదనలను పూర్తిగా వినలేదు. ఈ అంశాన్ని పునస్సమీక్షించండి” అంటూ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ చంద్రశేఖర్‌తో కూడిన బెంచ్‌ ఈ మేరకు తీర్పు వెల్లడించింది. అనర్హత ఎమ్మెల్యేల స్థానంలో తిరిగి ఎన్నికలకు ఇచ్చిన నోటీసులను కోర్టు కొట్టివేసింది. ఈసీ ప్రతిపాదనలు చట్టసమ్మతం కాని నిర్ణయంగా వ్యాఖ్యానించింది. న్యాయస్థానం ప్రకటనపై కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ఎన్నికైన ప్రభుత్వంపై తీవ్ర చర్యగా ఈసీ నిర్ణయాన్ని అభివర్ణించారు.