Delhi MCD Election Result: ఢిల్లీ కార్పొరేషన్ పీఠం ఆప్ కైవసం.. బీజేపీ చేసిన తప్పులు ఇవే..
AAP Victory Reasons in MCD: ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరులేని విజయాన్ని సొంతం చేసుకుంది. 15 ఏళ్ల బీజేపీ కోటను బద్ధలు కొట్టింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పత్తాలేకుండా పోయింది. ఢిల్లీ ప్రజలు ఎందుకు బీజేపీని తిరస్కరించారు..? ఆప్ పార్టీకి కలిసి వచ్చిన అంశాలు ఏవి..?
AAP Victory Reasons in MCD: ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుంది. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఇప్పటివరకు ఆప్ 134 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందింది. మొత్తం 250 సీట్లు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 126. ఆప్ పార్టీకి చెందిన 134 మంది అభ్యర్థులు విజయం సాధించడంతో ఢిల్లీ మేయర్ స్థానం ఆ పార్టీ సొంతమైంది. గత 15 ఏళ్లుగా ఎంసీడీలో అధికారంలో ఉన్న బీజేపీ అనూహ్యంగా ఓటమి చెందడం ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కనీసం ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితమైంది. స్వతంత్రులు మూడు స్థానాల్లో విజయం సాధించారు.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నా.. కార్పొరేషన్‌లో బీజేపీ ఉండడంతో పారిశుద్ధ్యం పడకేసింది. ఢిల్లీలో పేరుకుపోయిన చెత్తను ఊడ్చేయాలంటే బీజేపీని సాగనంపాలంటూ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన నినాదం జనాల్లోకి బలంగా వెళ్లింది. దీంతో గత 15 ఏళ్లుగా ఎంసీడీలో అధికారంలో ఉన్న బీజేపీని ఢిల్లీ ప్రజలు పక్కనబెట్టారు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఢిల్లీ నగరంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
బీజేపీ ఓటమికి కారణాలు..
గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ పారిశుద్ధ్యాన్ని అసలు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా పార్టీ పెద్దలు ఎంసీడీని పట్టించుకోకుండా స్థానిక నేతలకే వదిలేశారు. దీంతో వారు ఆడిందే ఆట.. పాడి పాటగా మారింది. తీవ్రస్థాయిలో అవినీతి పేరుకుపోయిందని ఆరోపణలు వచ్చాయి. స్థానిక నాయకులు అభివృద్ధిని గాలికి వదిలేసి.. ఎప్పుడు సీఎం కేజ్రీవాల్‌ను, ఆప్ పార్టీ నేతలను తిట్టుకుంటూనే ఉన్నారు. దీంతో బీజేపీ పట్ల ఓటర్లలో అసహనం పెరిగి ఓట్ల ద్వారా గుణపాఠం చెప్పారు.
జైలులో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోల వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఓటింగ్ సమయంలో ప్రజలు బీజేపీని నమ్మకుండా.. కార్పొరేషన్‌లో పరిశుభ్రత, అవినీతి వంటి అంశాలపై దృష్టి సారించి ఆప్‌కి ఓటు వేశారు.
ఈ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఆప్ 2017 సంవత్సరం నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఈ ఐదేళ్లలో పార్టీ సంస్థను ఢిల్లీ అంతటా విస్తరించారు. కొత్త నాయకులు, కార్యకర్తలను చేర్చుకుని నగరంలోని ప్రతి ప్రాంతానికి పార్టీని తీసుకెళ్లారు. దీంతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారులు మరియు కౌన్సిలర్ల అవినీతిపై దాడి చేస్తూ.. బీజేపీపై నిరంతరం అటాక్ చేశారు. ఈ పక్కా ప్రణాళికాబద్ధమైన వ్యూహమే ఆప్‌కు విజయాన్ని కట్టబెట్టింది.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ కలిసి వచ్చింది. అవినీతిలో కొంచెం కూడా రాజీపడని నైజంతో ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకున్నారు. కేజ్రీవాల్‌కి ఉన్న ఈ ఇమేజ్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడంలో చాలా దోహదపడింది.
ఢిల్లీ ఉద్యోగ నిపుణులు, వ్యాపారవేత్తల నగరం. పూర్తి ప్రణాళికతో ఈ రెండు విభాగాల్లోనూ ఆమ్ పార్టీ తన పునాదిని పెంచుకుంది. పార్టీ బిజినెస్ విభాగం ద్వారా.. వ్యాపార వర్గానికి చెందిన ప్రముఖ వ్యక్తులు సంస్థతో అనుసంధానించింది. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆర్‌డబ్యూఏ వింగ్ ద్వారా సెక్టార్లు, నివాస ప్రాంతాలలో వ్యాప్తి పెరిగింది. ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ఎంసీడీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు తమ సమస్యల కోసం తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. దశలవారీగా వారికి అన్ని సౌకర్యాలు అందిస్తామన్నారు. పార్టీ చేసిన ఈ వాగ్దానాలు ప్రజలను ఆకర్షించాయి.
అరవింద్ కేజ్రీవాల్‌ను హిందూ వ్యతిరేకిగా ప్రకటించాలని బీజేపీ పక్కా వ్యూహంతో ప్రచారం ప్రారంభించింది. ఇఫ్తార్ విందు సందర్భంగా కేజ్రీవాల్ తలపై ముస్లిం టోపీ పెట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఆయనపై వ్యక్తిగత దాడులు చేశారు. ఆయన ముస్లిం అనుకూల.. హిందూ వ్యతిరేకి అని నిరూపించే ప్రయత్నం జరిగింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యూహాన్ని వెంటనే గ్రహించారు. మృదువైన హిందూత్వ వ్యూహాన్ని అనుసరించి సక్సెస్ అయ్యారు. ప్రధాని మోదీలాగే ఆయన కూడా ఆలయాల నుంచి ఎన్నికల పర్యటనలు ప్రారంభించి.. తన సమావేశాల్లో భారత్ మాతా కీ జై, వందేమాతరం అంటూ బహిరంగంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ వ్యూహం బెడిసికొట్టింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు పట్టం కట్టబెట్టింది.
Also Read: IND Vs BAN: సెంచరీ బాదిన మెహిదీ హసన్.. భారత్ ముందు భారీ టార్గెట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి