ముంబై: ఢిల్లీలో కరోనావైరస్ మరోసారి విజృంభిస్తుండటంతో కరోనా కారణంగా తీవ్ర ప్రభావానికి గురైన మహారాష్ట్ర సర్కార్ మరోసారి ఆలోచనలో పడింది. పరిస్థితి చేయి దాటి పోకముందే తేరుకోకపోతే.. మహారాష్ట్రలో సైతం సెకండ్ వేవ్ చూడాల్సి వస్తుందని ఆందోళనకు గురవుతున్న మహారాష్ట్ర సర్కార్.. అందుకు పరిష్కారంగా ఢిల్లీ నుంచి ముంబై మధ్య రైళ్లు, విమానాల రాకపోకలు నిలిపేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ - ముంబై మధ్య నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండటంతో వారి ద్వారా కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉంటుందనే కోణంలో మహారాష్ట్ర సర్కార్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీలో పరిస్థితి సద్దుమణిగే వరకు ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చే రైళ్లు, విమానాలను ( Delhi to Mumbai trains, flights ) నిలిపేస్తే.. ముంబైలో కరోనా కేసులు పెరగకుండా కొంతవరకైనా ఆపవచ్చని ఉద్ధవ్ థాకరే సర్కార్ భావిస్తోందట. అయితే దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.


ఢిల్లీలో నిన్న గురువారం ఒక్క రోజే 7,456 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల పండగల సీజన్‌లో ( festive season ) రద్దీ ప్రదేశాల్లో జనం తాకిడి పెరగడం, కాలుష్యం పెరగడంతో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిన సంగతి తెలిసిందే.