పాకిస్తాన్ గర్ల్ ఫ్రెండ్‌కి.. సీక్రెట్స్ చెప్పి జైలుకెళ్లాడు..!
భారతీయ వైమానిక దళానికి చెందిన ఓ ఉద్యోగిని దేశ రహస్యాలను బయటకు చేరవేస్తున్నందుకు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
భారతీయ వైమానిక దళానికి చెందిన ఓ ఉద్యోగిని దేశ రహస్యాలను బయటకు చేరవేస్తున్నందుకు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్‌గా పనిచేస్తున్న అరుణ్ మర్వా గతకొంత కాలంగా ఓ పాకిస్తాన్ అమ్మాయితో స్నేహం చేస్తున్నాడు. వారిద్దరూ వాట్సాప్ ద్వారా పరిచయమై.. ఆ తర్వాత మంచి స్నేహితులుగా మారారు.
ఈ క్రమంలో తను చేస్తున్న ఉద్యోగం గురించి ఆ పాక్ అమ్మాయికి చెప్పిన అరుణ్.. తర్వాత వైమానిక దళానికి చెందిన పలు ఫోటోలను కూడా ఆమెకు వాట్సాప్ ద్వారా పంపించాడు. ఆమె కోరిక మేరకు కొన్ని అదనపు ఫోటోలు తీయడానికి ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టినప్పుడు.. ఆయన కదలికలు అనుమానాస్పదంగా అనిపించడంతో పలువురు ఆ అధికారిపై యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విజిలిన్స్ విభాగం ఆ సదరు అధికారి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని.. మొత్తం డేటా పరిశీలించాక.. వారికి నిజాలు తెలిశాయి.
ఈ క్రమంలో అనుమతి లేకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన ప్రాంతాలను ఫోటోలు తీయడమే కాకుండా.. వాటిని పాకిస్తాన్ అమ్మాయికి పంపినందుకు ప్రస్తుతం అరుణ్ మర్వాపై కేసు నమోదు అయ్యింది.
భారతీయ వైమానిక దళం నుండి అధికారికంగా ఫిర్యాదు అందడంతో ప్రస్తుతం అతన్ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అరుణ్‌ను పరిచయం చేసుకొని ఛాట్ చేసిన అమ్మాయి ఐఎస్‌ఐ ఏజెంట్ అయ్యే అవకాశం ఉందని తాము అనుమానిస్తున్నామని.. ఈ విషయాలపై లోతుగా పరిశోధన చేయాల్సి ఉందని పోలీసులు మీడియాకి తెలియజేశారు.