వాయు కాలుష్యం దేశరాజధానిని అతలాకుతలం చేస్తోంది. వాతావరణంలో స్వచ్ఛత తగ్గిపోవడంతో, కాలుష్యం విపరీతంగా పెరిగిపోతూ అత్యవసర స్థితి నెలకొంటోంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం నగరంలో పాఠశాలలకు, కార్యాలయాలకు హై ఎలర్ట్ ప్రకటించి సెలవులు మంజూరు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాతావరణంలో నాణ్యత పూర్తిగా తగ్గిపోయే స్థితి తలెత్తడంతో ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాల్సిన అవసరం ఉందని పలు ప్రజా సంఘాలు విన్నవించుకుంటున్నాయి.


పొగమంచు ఒక్క పక్క జనాలను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తుండగా.. దానికి తోడు ఎక్కడో భారీగా చెత్తను కాల్చడం వల్ల ఏర్పడిన పొగ,  మంచుతో  కలిసి ప్రజలను నరకయాతనకు గురిచేసింది. మంగళవారం, బుధవారం రోజుల్లో ఉదయం దాని తీవ్రత మరింత పెరిగింది.


పొగ కాలుష్యం ఒక్కసారిగా నగరాన్ని చుట్టేయడంతో వాహన చోదకులు నానా ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల రోడ్లపై మబ్బు కమ్మేయడంతో యాక్సిడెంట్లు కూడా సంభవించాయి.  ఈ క్రమంలో ఉదయం పూట పొగమంచులో తిరగవద్దని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.


బయటకు వచ్చేవారు మాస్కులు తప్పకుండా ధరించాలని సూచించింది. ఢిల్లీలో వెంటనే కాలుష్యాన్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని, ప్రభుత్వాన్ని కోరుతూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రంగంలోకి దిగింది. వాహనాల ద్వారా వస్తున్న పొగకు తొలుత అడ్డుకట్ట వేయడం కోసం పార్కింగ్ ఛార్జీలను నాలుగు రెట్లు పెంచింది.


అలాగే మెట్రో రైళ్ల రేట్లను సగానికి సగం తగ్గించింది. ముఖ్యంగా ఈ కాలుష్యం వలన విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.