రైలు ప్రయాణం చేస్తున్నారా? అయితే ఐడీ కార్డులు చూపించనవసరం లేదు..!
రైల్లో ప్రయాణం చేసేవారు తప్పకుండా తమ ఐడీ కార్డులు టీసీ అడిగితే చూపించాలనే నిబంధన చాలా రోజుల నుండీ ఉంది
రైల్లో ప్రయాణం చేసేవారు తప్పకుండా తమ ఐడీ కార్డులు టీసీ అడిగితే చూపించాలనే నిబంధన చాలా రోజుల నుండీ ఉంది. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదు. ఐడెంటెటీ కార్డులుగా భావించే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు లాంటి వాటి బదులు వాటి సాఫ్ట్ కాపీలు చూపిస్తే చాలని అంటున్నారు రైల్వే అధికారులు.
ముఖ్యంగా రైల్వే ప్రయాణికులు డిజి లాకర్ యాప్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ వెబ్ లాకరులో తమ ఐడీ కార్డుల సాఫ్ట్ కాపీలు స్టోర్ చేసుకోవచ్చని అంటున్నారు. తమకు సంబంధించిన ఎలాంటి అధికారిక పత్రాలనైనా సరే ఈ డిజి లాకర్‌లో యూజర్లు నిక్షిప్తం చేసుకోవచ్చు. అయితే ఆ లాకర్‌లో అవి ఇష్యూడ్ డాక్యుమెంట్స్ విభాగంలో మాత్రమే స్టోర్ అయ్యి ఉండాలని అంటున్నారు అధికారులు. అలాగైతేనే వాటిని గుర్తింపు కార్డులుగా పరిగణిస్తామని అంటున్నారు.
క్లౌడ్ ఆధారితంగా పని చేసే డిజిలాకర్ యాప్ ఇప్పటికే సీబీఎస్‌ఈ విద్యార్థులకు మార్కు షీట్లను డిజిటల్ వెర్షన్‌లో అందివ్వడానికి ప్రయత్నిస్తోంది. డిజిలాకర్‌లో యూజర్లు తమ పాన్ కార్డు వివరాలు కూడా నిక్షిప్తం చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వం మంజూరు చేసే ఏ ఐడీకార్డునైనా కూడా అందులో నిక్షిప్తం చేసుకోవచ్చు.