జీఈఎస్‌లో... కేసీఆర్ `బిర్యానీ` ముచ్చట
కేసీఆర్ సదస్సుకి విచ్చేసిన అతిధులందరూ హైదరాబాదీ బిర్యానీని తప్పకుండా రుచి చూడాలని చెప్పారు
జీఈఎస్ సదస్సులో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్ ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా తన ఉపన్యాసంలో బిజినెస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ప్రధమ స్థానంలో ఉందని తెలిపారు. టిహబ్ అనే స్టార్టప్ ఇన్‌క్యుబేటర్ తెలంగాణలో ఉందని.. స్టార్టప్స్‌ను ప్రోత్సహించే దిశగా హైదరాబాద్ ముందుకు ప్రయాణిస్తుందని ఆయన తెలిపారు. ఎందరో ప్రపంచ పారిశ్రామికవేత్తలు ఈ రోజు హైదరాబాదుకు రావడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు హైదరాబాదులో ఉండడం గర్వకారణమని ఆయన చెప్పారు.
అన్ని రంగాలతో పాటు వ్యాపార రంగంలో కూడా భాగ్యనగరం నేడు ప్రపంచ నగరాలతో పోటీ పడుతుందని ఆయన తెలియజేశారు. హైదరాబాద్ యువత ఇతర దేశాల్లో కూడా వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో సంస్థలు ఏర్పాటు చేయాలని భావించే ఇతర దేశాలకు అనుమతులు వేగంగా ఇవ్వడానికి శ్రీకారం చుట్టామని.. ఈ నగరం నేడు విశ్వ నగరం స్థాయికి చేరిందని చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఇవాంక ట్రంప్‌కు, భారత ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఇక వంటకాల విషయానికి వస్తే.. వచ్చిన అతిథులందరూ హైదరాబాద్ బిర్యానీని తప్పకుండా రుచి చూడాలని తెలియజేశారు.