న్యూఢిల్లీ: అధికారిక వ్యవహారాల్లో, లావాదేవీల్లో షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన వారి గురించి ప్రస్తావించాల్సినప్పుడు ‘దళిత్/దళితులు' అనే పదాన్ని ఉపయోగించవద్దని కేంద్రం ఆదేశించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇంగ్లీష్‌లో షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ అని గానీ, లేదా దానికి సమానార్థకమైన ప్రాంతీయ భాషల్లోని పదాలను గానీ వాడాలని పేర్కొంటూ కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
 
1982 ఫిబ్రవరి 10న జారీ చేసిన ఆదేశాలను ఈ సందర్భంగా ప్రస్తావించిన కేంద్రం..  షెడ్యూల్డు కులాల ధ్రువపత్రాల్లో ‘హరిజన్’ అనే పదాన్ని వాడవద్దని అప్పటి ఆదేశాలను, మధ్యప్రదేశ్ హైకోర్టు జనవరి 15న ఇచ్చిన తీర్పునూ కేంద్ర సాంఘిక న్యాయం మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. రాజ్యాంగంలో కానీ, ఏదైనా చట్టంలో కానీ ‘దళితులు’ అనే పదం లేదని హైకోర్టు తెలిపిందని పేర్కొంది.
 
మార్చి 15న జారీ అయిన ఈ ఆదేశాల్లో ‘‘భారతదేశ రాజ్యాంగంలోని అధికరణ 341 ప్రకారం జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో నోటిఫై చేసిన షెడ్యూల్డు కులాలకు చెందిన వ్యక్తుల గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు .. అన్ని అధికారిక లావాదేవీలు, వివాదాలు, వ్యవహారాలు, ధ్రువపత్రాలు మొదలైనవాటిలో, ఇంగ్లిష్‌లో అయితే ‘షెడ్యూల్డు కేస్ట్’ అని, లేదా దానికి సమానార్థకమైన ప్రాంతీయ భాషల్లోని పదాలను గానీ మాత్రమే  వాడాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు.