దెహ్రాదూన్: దెహ్రాదూన్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఘోర ప్రమాదం తప్పింది. దూన్ ఎక్స్‌ప్రెస్ రైలును షంటింగ్ (ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కి రైలును తీసుకెళ్లడం, సమస్యాత్మకమైన రైలు బోగీలను రైలు నుంచి వేరుచేయడం, గుడ్స్ రైళ్లను షెడ్ వైపు తరలించడం, సేఫ్టీ చెకింగ్ వంటి పనులు) చేసే సమయంలో అదుపుతప్పి ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లింది. అయితే, అదృష్టవశాత్తుగా ఆ సమయంలో రైలులో కానీ లేదా రైలు ఢీకొన్న ఫ్లాట్‌ఫామ్‌పై కానీ ప్రయాణికులు ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 


ఈ ప్రమాదానికి గల కారణం ఏంటనేది ఇంకా తెలియాల్సి వుండగా.. బ్రేకులు పడని కారణంగా రైలు ప్లాట్‌ఫామ్‌ని ఢీకొందని షంటర్ చెప్పినట్టుగా దెహ్రాదూన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ఏఎన్ఐకి తెలిపారు. జరిగిన ఘటనపై విచారణ చేపట్టి, షంటర్‌పై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ చెప్పినట్టుగా ఏఎన్ఐ పేర్కొంది.