ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ దగ్గరలోని అరన్ పూర్ ప్రాంతంలో ఈ రోజు జరిగిన నక్సల్స్ దాడిలో దూరదర్శన్ కెమెరామ్యాన్‌తో పాటు ఇద్దరూ సెక్యూరిటీ అధికారులు స్పాట్‌లో మరణించారు. ఎలక్షన్ల ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో సంబంధిత కవరేజీ కోసం దంతెవాడ ప్రాంతానికి వెళ్తున్న దూరదర్శన్ రిపోర్టర్లపై మావోయిస్టులు ఉన్నట్టుండి దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మూడు రోజుల క్రితం ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ ప్రాంతంలో రెచ్చిపోయిన మావోయిస్టులు నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడిలో వారు ల్యాండ్ మైన్ వాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే దాడిలో మరో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో మరణించిన వారిలో అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్‌తో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత దంతెవాడ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు విరివిగా సంచరిస్తున్నారని... వారి మీద ప్రత్యేక నిఘా పెట్టామని కూడా పోలీసులు తెలిపారు. 


కాగా.. సోమవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఒకప్పటితో పోల్చుకుంటే మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల సంఖ్య తగ్గిందని తెలిపారు. గతంలో 150 ప్రాంతాలు మావోయిస్టుల కనుసైగల్లో ఉంటే.. తాము అధికారంలోకి వచ్చాక అవే ప్రాంతాల సంఖ్య 78-80కు తగ్గిందని అన్నారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన రెండు రోజుల్లోనే మళ్లీ మావోయిస్టులు రెచ్చిపోయారు. ఈ క్రమంలో వారి ప్రాబల్యాన్ని మళ్లీ చూపించడం కోసమే దూరదర్శన్ రిపోర్టర్లపై దాడి చేశారని పలువురు అంటున్నారు.