దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి జనాలను ఆందోళనకు గురిచేసింది. దుమ్ము, ధూళితో కూడిన దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో పట్ట పగలే అంతా చీకటి వ్యాపించింది. అలాగే బలమైన గాలులు వీస్తుండడంతో కొన్ని చోట్ల చెట్లు కూలాయి. అలాగే పలు ప్రాంతాల్లో వర్షం కూడా పడింది. అనుకోకుండా వాతావరణ మార్పు ఏర్పడడంతో ఢిల్లీ మెట్రో రైలు సర్వీసులను కొన్ని గంటలు నిలిపివేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే ఎయిర్ పోర్టులో విమానం రాకపోకలను కూడా ఆపేశారు. పలు ఫ్లైట్లను దారి మళ్లించారు. ఈ వాతావరణ మార్పు సంభవించడం వల్ల పలు ప్రభుత్వ కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయి. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, జమ్మూ మరియు కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో భారీ వర్షసూచన నమోదైంది. రాజస్థాన్‌లో కూడా దుమ్ము తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 


తాజాగా ఢిల్లీలో వాతావరణ మార్పు సంభవించాక.. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని తెలిపింది. విపత్తు శాఖ కూడా ఏ పరిస్థితిలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అంచనా వేయలేం కాబట్టి.. తగు ముందస్తు జాగ్రత్తలతో అధికారులు వ్యవహరించాలని.. ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపింది.