జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 4.6గా నమోదైంది. బుధవారం ఉదయం 5:15 గంటలకు భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొద్దిసేపటికే ఉదయం 5:43 గంటలకు హర్యానా రాష్ట్రంలో కూడా స్వల్పంగా భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో భూమి కంపించడంతో రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 3.1గా నమోదైంది. భూ ప్రకంపనలు సంభవించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురై ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు.


రిక్టర్ స్కేలుపై అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నివేదికలు కొద్దిసేపటి క్రితం వెలువడ్డాయి. ఉదయం 10:20 సమయంలో అసోంలోని కోక్రాఝర్ ప్రాంతంలో భూమి కంపించింది. ఇదే సమయంలో పశ్చిమబెంగాల్, బీహార్, బంగ్లాదేశ్‌లలోనూ బలమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గౌహతిలో సుమారు 10 సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లనుంచి బయటికి పరుగులు తీశారు.


ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు.. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.


అంతకు ముందు సెప్టెంబరు 9న ఝజ్జర్ జిల్లాలో రిక్టర్ స్కేలుపై 3.8తీవ్రతతో భూకంపం సంభవించింది.