న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆఫ్గనిస్థాన్‌లోని హిందూ కుశ్ పర్వతాల్లో భారీ భూకంపం సంభవించిన అనంతరం ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. హిందూ కుశ్ పర్వతశ్రేణుల్లోని (Hindu Kush region) జర్మ్ అనే ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. కాబూల్‌కి ఉత్తరాన 245 కిమీ దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్టు భూకంప అధ్యయన కేంద్రం (National Center for Seismology) పేర్కొంది. ఆప్ఘనిస్తాన్‌లో భూకంపం (Earthquake hits Afghanistan) తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.3గా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలోనూ ప్రకంపనలు.. 
ఢిల్లీ వాసులను మరోసారి భూకంపం వణికించింది. ఢిల్లీతో పాటు ఎన్‌సిఆర్ రీజియన్ (Delhi-NCR region)లోని నొయిడా, గ్రేటర్ నొయిడా, ఫరీదాబాద్, గుర్‌గావ్‌లోనూ భూమి కంపించింది. శుక్రవారం సాయంత్రం 5:12 గంటలకు ఉత్తర భారతంలోని పంజాబ్, చండీఘడ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో భూమి కొన్ని క్షణాలపాటు కంపించింది. ఆఫ్గనిస్థాన్‌లో భారీ భూకంపం అనంతరమే ఢిల్లీలో భూమి కంపించిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

పాకిస్తాన్‌లోనూ భూ ప్రకంపనలు..
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం అనంతరం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్, లాహోర్‌లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది.