మధ్యప్రదేశ్‌ శాసనసభకు త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. బీజేపీ 60 లక్షల మంది బోగస్‌ ఓటర్లను జాబితాలో చేర్చిందని కాంగ్రెస్‌ ఆరోపించి.. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు (ఈసీ) ఓటర్ల జాబితాను అందజేస్తూ ఫిర్యాదు చేసింది. దీనిపై ఈసీ దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలను దర్యాప్తు చేయడానికి ఈసీ రెండు బృందాలను ఏర్పాటు చేసింది. జూన్ 7 నాటికి ఈ బృందాలు నివేదికను సమర్పించాలి. ముందుగా నరేలా, భోజ్‌పూర్, సియోనీ-మాల్వా, హోషంగాబాద్ అసెంబ్లీ సీట్లలో ఈ అవకతవకలు ఎలా జరిగాయో తెలుసుకోవడానికి బృందాలు వెళుతున్నాయి. నేడు మధ్యపదేశ్‌లో బృందాలు పర్యటించనున్నాయి.


ఆదివారం, మధ్యప్రదేశ్‌ శాసనసభకు త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ 60 లక్షల మంది బోగస్‌ ఓటర్లను జాబితాలో చేర్చిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ ఆరోపించారు. నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న మధ్యప్రదేశ్‌లో అమాంతం ఓటర్ల లిస్టు పెరిగిపోయిందని కాంగ్రెస్ ఆరోపించింది. గత పదేళ్లలో 24 శాతం జానాభా పెరిగితే ఓటర్లు 40 శాతం ఎలా పెరిగారో అర్థం కావటం లేదని ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా ఆరోపించారు. ఓటరు జాబితాలో 60 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారని, ఒక్కో ఓటరు పేరు 26 జాబితాల్లో రిజిస్టర్ అయిందని సాక్ష్యాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.