ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి పదవికి సుర్జిత్ భల్లా రాజీనామా!
ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి పదవికి సుర్జిత్ భల్లా రాజీనామా!
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా దేశాన్ని కుదిపేసిన మరుసటి రోజే కేంద్రంలో మరో ఆసక్తికరమైన కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి నుంచి ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా పక్కకు తప్పుకున్నారు. డిసెంబర్ 1నే తాను తన తాత్కాలిక సభ్యుని పదవికి రాజీనామా చేసినట్టు సుర్జిత్ భల్లా ట్విటర్ ద్వారా ప్రకటించారు. సుర్జిత్ భల్లా తన పదవికి రాజీనామా చేసినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ సైతం వెల్లడించింది. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలికి ప్రస్తుతం నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ డెబ్రోయ్ నేతృత్వం వహిస్తుండగా ప్రముఖ ఆర్థికవేత్తలు రతిన్ రాయ్, అషిమా గోయల్, షమిక రవి ఇతర తాత్కాలిక సభ్యులుగా ఉన్నారు.
ఇప్పటికే ఉర్జిత్ పటేల్ ఆర్బీఐకి రాజీనామా చేసిన వైనం చర్చనియాంశం కాగా కేంద్రంలో కీలకమైన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో చోటుచేసుకున్న ఈ పరిణామం ఇంకెన్ని చర్చలకు దారితీస్తుందోననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సుర్జిత్ భల్లా రాజీనామాకు దారితీసిన పరిస్థితులు, కారణాల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.