ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్
జేడీయూలో చేరిన వైసీపీ ఎన్నికల వ్యూహకర్త
బీజేపీ, వైసీపీ వంటి రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ మేరకు ఈరోజు బీహార్‌లోని పాట్నాలో జేడీయూ పార్టీలో చేరారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయన్ను సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీల తరఫున పోటీ చేయాలని బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఆఫర్లు వచ్చినా తిరస్కరించిన ప్రశాంత్ కిషోర్.. సొంత రాష్ట్రంలో రాజకీయ నేతగా ఎదగాలని నిర్ణయించుకున్నారు.
బీహార్‌కి చెందిన ప్రశాంత్ కిశోర్ గతంలో ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేశారు. అనంతరం ఎన్నికల వ్యూహకర్తగా మారారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చేందుకు 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషించారు. 2015 బీహార్ ఎన్నికల్లో మహాకూటమిని అధికారంలోకి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. 2017 పంజాబ్ ఎన్నికల్లోనూ కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు వెన్నుండి కాంగ్రెస్ విజయానికి కారణమయ్యారు. ఏపీలో వైసీపీకి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.