తన గొంతు నొక్కేయాలని కుట్ర పన్నుతున్న అదృశ్య శక్తులు, తనని ఎన్‌కౌంటర్ చేసేందుకు ఎత్తుగడ వేసినట్టు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఆందోళన వ్యక్తంచేశారు. ప్రవీణ్ తొగాడియా అదృశ్యమైనట్టు వార్తలు వెలువడిన తర్వాతి రోజైన మంగళవారం షాహీబాగ్‌లో అపస్మారక స్థితిలో కనిపించిన ఆయన, లో బీపీ సమస్యతో ఆస్పత్రిపాలయ్యారు. అనంతరం కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ... తనని ఇక్కడి నుంచి తీసుకెళ్లి, ఎన్‌కౌంటర్ చేసేందుకు కుట్ర జరుగుతోందనే సమాచారంతో తనకు తానుగానే వీహెచ్‌పీ కార్యాలయం నుంచి తప్పించుకుని పారిపోయినట్టు ప్రవీణ్ తొగాడియా తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామ మందిరం, గో వధకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావాల్సిన ఆవశ్యకత, రైతుల సమస్యలపై తాను గళం విప్పాను. తనని ఏమీ చేయాలని వాళ్లు కొంతమంది తన గొంతు నొక్కేయాలని కుట్రపన్నారు. ఎప్పటికప్పుడు అటువంటి ప్రయత్నాలు జరుగూతూనే వున్నాయి. అందులో భాగంగానే తనని చివరకు ఎన్ కౌంటర్ చేసేందుకు సైతం కుట్ర జరుగుతున్నట్టు ఆవేదన వ్యక్తంచేస్తూ మీడియా ముందే కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరు ఎన్ని కుట్ర చేసినా.. తాను తన పోరాటం ఆపను అని ప్రవీణ్ తొగాడియా స్పష్టంచేశారు. ప్రవీణ్ తొగాడియాను పరీక్షించిన వైద్యులు, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని అన్నారు. 


సోమవారం ఉదయం ప్రవీణ్ తొగాడియాను అరెస్ట్ చేసేందుకు రాజస్థాన్ పోలీసుల బృందం వీహెచ్‌పీ కార్యాలయానికి వెళ్లగా అప్పటికే అతడు అక్కడి నుంచి బయటికి వెళ్లినట్టు తెలిసింది. ప్రవీణ్ తొగాడియా ఇంటికి వెళ్లిన పోలీసులకి అక్కడ కూడా అతడి ఆచూకీ లభించలేదు. అలా నిన్న ఉదయం నుంచి అదృశ్యమైన ప్రవీణ్ తొగాడియా మంగళవారం ఉదయం షాహీబాగ్ లో అపస్మారక స్థితిలో కనిపించారు. 


ఇదిలావుంటే, ఐపీసీ సెక్షన్ 188 కింద జారీ అయిన అరెస్ట్ వారెంట్ ప్రకారమే ప్రవీణ్ తొగాడియాను అరెస్ట్ చేసేందుకు కొంతమంది పోలీసుల బృందం అతడి ఇంటికి వెళ్లిన మాట వాస్తవమే కానీ అప్పటికే అతడు ఇంట్లో లేరు అని సోలా పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ మీడియాకు తెలిపారు.