మహారాష్ట్రలో రైతన్నల ఘన విజయం
మహారాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, తమ రైతాంగ సమస్యలను ఒక కొలిక్కి తెచ్చేందుకు కొన్ని వేలమంది రైతులు రెండు రోజులుగా 180 కిలోమీటర్లు ప్రయాణించి మరీ నాసిక్ నుండి ముంబయి చేరుకున్న సంగతి తెలిసిందే.
మహారాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, తమ రైతాంగ సమస్యలను ఒక కొలిక్కి తెచ్చేందుకు కొన్ని వేలమంది రైతులు రెండు రోజులుగా 180 కిలోమీటర్లు ప్రయాణించి మరీ నాసిక్ నుండి ముంబయి చేరుకున్న సంగతి తెలిసిందే. కాళ్లు అరిగిపోయినా.. డొక్కలు ఎండిపోయినా.. అదరక బెదరక వారు చేసిన పోరాటం సత్ఫలితాలను ఇచ్చింది. ప్రభుత్వమే దిగివచ్చింది.
మండుటెండలను సైతం లెక్కచేయక వారు చేసిన పని మరికొంత మంది రైతులలో స్ఫూర్తిని నింపి... వారు కూడా ఈ రైతులతో కలవగా.. దాదాపు 50 వేలమంది కర్షకులు మహారాష్ట్ర రాజధానికి తరలివచ్చారు. అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో వారు సాగించిన యాత్రలో పంట రుణాల మాఫీ ప్రధాన డిమాండ్ కాగా.. కనీస గిట్టుబాటు ధర కల్పించాలన్నది మరో డిమాండ్. వీటితో పాటు ఇంకా అనేక డిమాండ్లను ప్రభుత్వం ఎదుట పెట్టడానికి రాజధానికి వచ్చారు. విధానసభ ముట్టడి కోసం రాజధాని చేరుకున్న రైతులకు విపక్షాలు, శివసేన పార్టీ కూడా మద్దతు తెలిపింది.
ఈ క్రమంలో వారి సమస్యలను ఎట్టి పరిస్థితిలోనైనా పరిష్కరిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలపడంతో సంతోషం నిండిన కళ్ళతో.. ఉబికి వస్తున్న ఆనందభాష్పాలతో రైతులు తిరిగి వారి గ్రామాలకు ప్రయాణమయ్యారు. వారి తిరుగు ప్రయాణం కోసం ప్రభుత్వం ఉచితంగా స్పెషల్ రైళ్ళను వేయడం విశేషం. నాసిక్ నుండి మార్చి 6వ తేదిన ప్రారంభమైన ఈ కర్షక యాత్ర సోమవారం వరకు కొనసాగింది.
ఎలాంటి హింసకూ పాల్పడకుండా.. పూర్తి శాంతియుతంగా జరిగిన ఈ రైతు యాత్రలో.. కిసాన్ యాత్ర ప్రతినిధులు ఈ విజయానికి కారణం తమ సహనమే అని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా.. ఎవరికీ విఘాతం కలిగించకుండా.. ఉదయం 11 గంటల తర్వాతే ర్యాలీ ప్రారంభించామని వారు తెలిపారు. మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ ఈ విషయంపై మాట్లాడుతూ, రైతు సమస్యలను అనేకం తీర్చడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందని.. ఈ విషయంలో రైతులకు రాతపూర్వకమైన హామీ కూడా ఇస్తామని తెలిపారు.