మొన్న ఎస్‌ఎస్‌సీ.. నిన్న సీబీఎస్ఈ పేపర్ లీక్ ఉదంతం నుండి ఇంకా తేరుకోకముందే.. నేడు మరో పేపర్ లీక్ అయ్యింది. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) పోస్టుల భర్తీకి జరగాల్సిన పరీక్ష పత్రాలు లీక్‌ కావడం కలకలం రేపింది. ఆదివారం జరగాల్సిన ఎఫ్‌సీఐ పరీక్ష ప్రశ్నాపత్రం ముందుగానే లీక్‌ అయింది. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీకి చెందిన ఇద్దరు దళారులతో పాటు మధ్యప్రదేశ్‌లోని  గ్వాలియర్ లో 48 మంది అభ్యర్థులను మధ్యప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) పోలీసులు అరెస్టు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాచ్‌మెన్ పోస్టుల కోసం ఎఫ్‌సీఐ  ఆదివారం మధ్యప్రదేశ్‌లోని వివిధ కేంద్రాల్లో  పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ప్రశ్నాపత్రాన్ని ఇచ్చినందుకు ఒక్కో అభ్యర్థి నుంచి ఏజెంట్లు రూ 5 లక్షలు డిమాండ్‌ చేసినట్టు అధికారులు వెల్లడించారు. పోస్టుకు ఎంపికైన అనంతరం ఈ మొత్తాన్ని చెల్లించాలని తమను ఏజెంట్లు కోరారని అభ్యర్ధులు విచారణ సందర్భంగా చెప్పినట్టు సమాచారం. కాగా, అరెస్ట్‌ అయిన ఏజెంట్లను ఢిల్లీ నివాసితులు అశుతోష్‌ కుమార్‌, హరీష్‌ కుమార్‌లుగా గుర్తించారు. నిందితుల నుంచి చేతిరాతతో కూడిన ప్రశ్నాపత్రం, ఆన్సర్‌ షీట్‌ను ఎస్‌టీఎఫ్‌ స్వాధీనం చేసుకుంది. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.



 


ఇదిలా ఉంటే.. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీబీఎస్ఈ 12వ తరగతి ఎకనామిక్స్ పేపర్ లీక్‌కు కారణమైన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఉన్నారు. కాగా ప్రశ్నాపత్రాల లీక్ వ్యవ్యహారాలపై ప్రధాని మోదీ మౌనం వహించడం పట్ల కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.