అరుణ్ జైట్లీకి కిడ్నీమార్పిడి ఆపరేషన్...!
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రిలో కిడ్ని మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రిలో కిడ్ని మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. జైట్లీకి కిడ్నీదానం చేసిన దాతతో పాటు మంత్రి ఆరోగ్యం కూడా ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 65 సంవత్సరాల జైట్లీ ఈ ఆపరేషన్ నిమిత్తం శనివారం ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది.
కొద్ది కాలంగా కిడ్నీ సంబంధిత ఆరోగ్య రుగ్మతలతో బాధపడుతున్న జైట్లీ ఓ నెల రోజులుగా డాక్టర్ల సూచన మేరకు డయాలసిస్ చేయించుకుంటున్నారు. అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సందీప్ గులేరియా ఆధ్వర్యంలో జైట్లీకి సంబంధించిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. డాక్టర్ సందీప్ గులేరియా, ఎయిమ్స్‌కి డైరెక్టరుగా వ్యవహరిస్తున్న డాక్టర్ రణదీప్ గులేరియాకి స్వయానా సోదరుడు కావడం గమనార్హం.
ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ఉండడం వల్లే మంత్రి లండన్‌లో జరగబోయే భారత్-యూకే ఆర్థిక సదస్సుకి హాజరుకావడం లేదని తెలిపారు. అలాగే తన ఆరోగ్య పరిస్థితి గురించి ఏప్రిల్ 6, 2018 తేదిన తొలిసారిగా ట్వీట్ చేశారు. ఇలాంటి ఆరోగ్య సమస్యలు జైట్లీకి కొత్తేమీ కాదు. సెప్టెంబరు 2014లో తొలిసారిగా ఆయన డయాబెటిస్ వల్ల విపరీతంగా బరువు పెరిగారు.
ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం మాక్స్ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకోవడానికి చేరారు. అయితే మళ్లీ అదే సర్జరీ కోసం ఎయిమ్స్ వైద్యులను సంప్రదించి.. ఎయిమ్స్‌లోనే ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. అలాగే కొన్ని సంవత్సరాల క్రితమే జైట్లీకి గుండె సర్జరీ కూడా జరిగింది