ఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్ఖిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్ కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్‌‌కి చేరుకున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ పత్రాలు ఉన్న బహి ఖాతాను ఆమె మీడియా ఎదుట ప్రదర్శించారు. బడ్జెట్ పత్రాలు వున్న బ్రీఫ్‌కేస్‌తో పార్లమెంట్‌కి చేరుకునే బ్రిటీష్ సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ బహి-ఖాతాతో ఆమె పార్లమెంట్‌కి వచ్చారు. నాలుగు మడతలున్న ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ పత్రాలను పొందుపర్చి వాటిని పార్లమెంట్‌కి తీసుకొచ్చారు. దీనినే బహి ఖాతా అని కూడా అంటారు. అంతకన్నా ముందుగా రాష్ట్రపతి భవన్‌కి వెళ్లి అక్కడ కాసేపు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. బడ్జెట్ రూపకల్పనలో తనకు సహకరించిన ఆర్థిక శాఖ నిపుణులతో కలిసి బడ్జెట్ కూర్పు, ముఖ్యాంశాలపై రాష్ట్రపతికి క్లుప్తంగా వివరించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, ఇంకొద్దిసేపట్లో పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానున్న నేపథ్యంలో బడ్జెట్ పత్రాలను సభ్యులకు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ పత్రాలు ఉన్న బ్యాగులను పార్లమెంట్‌కి చేర్చారు.