మధ్యప్రదేశ్: శుక్రవారం చింద్వారా విమానాశ్రయం వద్ద సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కమల్‌నాథ్‌కు ఒక పోలీస్ కానిస్టేబుల్ తుపాకీని ఎక్కుపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ కానిస్టేబుల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్) ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు చెప్పిన ప్రకారం, ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది సదరు పోలీస్ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని డిసెంబర్ 15 నుంచి సస్పెన్షన్‌లో ఉంచారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సంఘటన గురించి మధ్యప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ మరియు రాజ్యసభ సభ్యుడు వివేక్ టాంఘా ట్విట్టర్‌లో పోస్టు పెట్టాక అందరికీ తెలిసింది. ఆయన ఈ సంఘటనను ఖండిస్తూ మాట్లాడారు. "చింద్వారా ఎయిర్ పోర్ట్ వద్ద కమల్‌నాథ్‌జీకు ఒక పోలీస్ కానిస్టేబుల్ లోడెడ్ గన్ ఎక్కుపెట్టాడు. ఇవి ద్వేషపూరిత రాజకీయాలేనని, ఇలాంటివాటిని తీవ్రంగా ఖండించాలి" అని పేర్కొన్నారు. ఈ సంఘటన చింద్వారా విమానాశ్రయం వద్ద 5:00 గంటలకు జరిగింది. ఇది రాష్ట్ర రాజధాని భోపాల్ నుండి 320 కిలోమీటర్ల దూరంలో ఉంది.


కమల్‌నాథ్ లోక్‌సభలో చింద్వారా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం భారత పార్లమెంటులో అత్యధిక కాలం సభ్యులుగా ఉన్నవారిలో ఆయనొకరు. ఈయన చింద్వారా నుండి తొమ్మిది సార్లు ఎన్నికయ్యారు.