న్యూ ఇయర్ సందర్భంగా.. ఢిల్లీలో హై ఎలర్ట్ ప్రకటన..!
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ద్వారా వచ్చిన ఉత్తర్వుల మేరకు ఢిల్లీ పోలీసు యంత్రాంగం నగరంలో హై ఎలర్ట్ ప్రకటించింది.
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ద్వారా వచ్చిన ఉత్తర్వుల మేరకు ఢిల్లీ పోలీసు యంత్రాంగం నగరంలో హై ఎలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో డిసెంబరు 31తో పాటు కొత్త సంవత్సరం నాడు కూడా దేశరాజధాని న్యూఢిల్లీతోపాటు, ఆ నగర చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో పోలీసులు భద్రతను పటిష్టం చేయనున్నారు. ముఖ్యంగాసెంట్రల్ ఢిల్లీలో పాటు ఇండియాగేట్, రాజ్‌పథ్, కన్నాట్‌ప్లేస్ తదితర ప్రాంతాల్లో సమయానుసారం ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని నిర్ణయించింది పోలీస్ వ్యవస్థ.
ముఖ్యంగా కన్నాట్‌ప్లేస్ వైపు వచ్చే వాహనాలను నిలుపుదల చేస్తూ.. ఇండియా గేట్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో కూడా వాహనాల పార్కింగ్‌ను నిషేదించడం జరగింది. ఇటీవలే ముంబయిలోని కమలా మిల్స్‌లో ఘోర ప్రమాదం జరిగిన నేపథ్యంలో.. అటువంటి సంఘటనలు ఢిల్లీలో జరగకుండా చూసేందుకు ముఖ్యంగా కొత్త సంవత్సర వేడుకలపై కూడా కొన్నిచోట్ల నిషేధం విధించినట్లు తెలుస్తోంది.
పబ్స్‌తో పాటు రెస్టారెంట్ల మీద కూడా నిఘాను పటిష్టం చేయనున్నట్లు ఇప్పటికే పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ఖాన్ మార్కెట్ లాంటి చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. రూఫ్ టాప్ పార్టీలకు సాధ్యమైనంత వరకు పర్మిషన్ ఇవ్వకూడదని నిర్ణయించారు. ఎక్కువగా పబ్‌లు, కేఫ్‌లు ఉండే ప్రాంతాలలో ప్రత్యేక పోలీస్ టీమ్స్‌ను పంపనున్నారు. ఫైర్ ఇంజిన్ టీమ్స్ ఇప్పటికే రంగంలోకి దిగాయి. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఈ హై ఎలర్ట్ ప్రకటించడం జరిగిందని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.