రాష్ట్రపతి భవన్‌లో.. కూలీ నెంబర్ 1.
రాష్ట్రపతిభవన్‌లో నిన్న కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విజయం సాధించిన 112 మంది మహిళలకు సత్కార కార్యక్రమం జరిగింది.
రాష్ట్రపతిభవన్‌లో నిన్న కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విజయం సాధించిన 112 మంది మహిళలకు సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్, హెచ్‌ఎస్‌బీసీ సీఈఓ నైనాలాల్ కిద్వాయ్ లాంటి ప్రముఖ మహిళల సరసన ఓ సాధారణ మహిళా కూలీకి కూడా స్థానం దక్కడం విశేషం. ఆమె పేరే మంజు. నార్త్ వెస్టర్న్ రైల్వేలో ఆమె 2013 నుండీ రైల్వే కూలీగా పనిచేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాజస్థాన్‌లో ఒక రైల్వేస్టేషనులో కూలీగా నియమించబడిన తొలి మహిళ ఆమె. రైల్వేకూలీగా పనిచేస్తున్న ఆమె భర్త అర్థాంతరంగా చనిపోవడంతో ఆయన ఉద్యోగాన్ని ఆమెకు కల్పించింది రైల్వే శాఖ.
అయితే తొలుత ఆ ఉద్యోగం తనకు చాలా కష్టంగా ఉండేదని.. చదువు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డానని.. ఆ తర్వాత తగు శిక్షణ తీసుకొని ఉద్యోగంలో రాణించానని చెప్పారామె. ముఖ్యంగా 30 కేజీల బరువున్న తనకు దాదాపు 30 కేజీల బరువున్న లగేజీలు ఎత్తడం కష్టంగా ఉండేదని.. అయినా సులువైన పద్ధతుల్లో వాటిని ఎత్తడం నేర్చుకున్నానని ధైర్యంగా చెప్పారామె. పిల్లల బరువునే మోయగా లేనిది.. ఈ బరువు మోయలేనా అని భావించానని కూడా మంజు చెప్పడం గమనార్హం. రాష్ట్రపతి భవన్‌లో మంజు ఇచ్చిన ప్రసంగం రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌ని బాగా కదిలించింది.
"నేను ఎప్పుడూ సాధారణంగా ఉద్వేగానికి గురవ్వను. కానీ నా కుమార్తె లాంటి మంజు తన కథను చెప్పినప్పుడు మాత్రం చాలా ఉద్వేగానికి గురయ్యాను" అని ఆయన తెలపడం విశేషం. ఇదే సభలో రజావత్ (సర్పంచిగా ఎన్నికైన తొలి ఎంబీఏ విద్యార్థిని), రజనీ పండిట్ (తొలి భారతీయ మహిళా డిటెక్టివ్), ఇరా సింఘాల్ (సివిల్స్ టాపర్), బచేంద్రిపాల్ (ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ) మొదలైనవారు కూడా రాష్ట్రపతి చేతుల మీద సత్కారం పొంది తమ అనుభవాలను కూడా పంచుకున్నారు.