ఉగ్రవాద భావజాలానికి ప్రభావితులై.. ఇండియా విడిచి వెళ్లిపోయారు..!
భారతదేశానికి చెందిన నలుగురు యువకులు ఉగ్రవాద భావజాలానికి బాగా ప్రభావితులై.. దేశాన్ని విడిచి వెళ్లిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భారతదేశానికి చెందిన నలుగురు యువకులు ఉగ్రవాద భావజాలానికి బాగా ప్రభావితులై.. దేశాన్ని విడిచి వెళ్లిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నై, పూణె, బిజ్నౌర్ ప్రాంతాలకు చెందిన వేరు వేరు వ్యక్తులు, స్నేహితులుగా మారారు. వారు ఐసిస్ భావాలకు ప్రేరేపితులై.. సిరియాలో తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనాలని భావించారు. ఈ క్రమంలో గత సంవత్సరమే వారు ఖతర్ రాజధాని నగరమైన దోహాకి ప్రయాణమయ్యారు.
అక్కడ ట్రైనింగ్ క్యాంపులో కూడా పాల్గొన్నారు. ఖతర్‌కు ఏటా జాబ్స్ కోసం వచ్చే భారతీయుల్లాగే వీరు కూడా ఆ దేశానికి వచ్చి.. వివిధ ఉద్యోగాలు చేసుకోసాగారు. వీరిలో ఒకరు ఎయిర్‌లైన్స్‌లో జాబ్ కూడా పొందడం గమనార్హం. ఈ క్రమంలో వీరు రహస్యంగా చేస్తున్న కార్యకలాపాల గురించి తెలుసుకున్న అక్కడి ప్రభుత్వం వారిని కస్టడీలోకి తీసుకుంది. ఆ తర్వాత తదుపరి విచారణ నిమిత్తం భారత ప్రభుత్వాన్ని కూడా సంప్రదించింది.
ఇటీవలే డీఎన్‌ఏ పత్రిక ఉగ్రవాదులుగా మారాలనుకుంటున్న ఈ యువకుల గురించి వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ యువకుల్లో ఒకరు ఇప్పటికే సిరియాకి చేరినట్లు సమాచారం. ఇటీవలే ఖతర్ ప్రభుత్వం ఈ యువకులను భారత్‌కు తిరిగి పంపించేసింది. వీరిని ఇక్కడి ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ముఖ్యంగా ఈ యువకులు తమ కార్యకలాపాల కోసం సోషల్ మీడియాను వాహకంగా ఉపయోగించుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ యువకులు సిరియా, ఇరాక్ దేశాలను తమ కార్యకలాపాలకు ప్రధాన స్థావరాలుగా మార్చుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇటీవలే వీరి ప్రేరణతో దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నించిన మరో యువకుడిని కూడా ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.