షాకింగ్ రిపోర్ట్: వర్షాలు, వరదలకు 868 మంది మృతి
868 మందిని బలితీసుకున్న భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు, పోటెత్తుతున్న వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరదల్లో గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోవడంతో లక్షలాది జనం నిరాశ్రయులయ్యారు. కేరళలో ఈ ఏడాది కురిసిన వర్షాలు, పోటెత్తిన వరదల కారణంగా 324 మంది చనిపోయినట్టు కేంద్ర హోంశాఖకు చెందిన నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్(ఎన్‌ఈఆర్‌సీ) స్పష్టంచేసింది. ఎన్‌ఈఆర్‌సీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో వర్షాలు కురిసి, వరదలు సంభవించి, కొండచరియలు విరిగిపడిన కారణంగా ఇప్పటి వరకు 868 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది వర్షాలు, వరదల కారణంగా కేరళ రాష్ట్రంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు ఎన్ఈఆర్‌సీ నివేదిక పేర్కొంది. కేరళ తర్వాతి స్థానంలో ఉత్తర్ ప్రదేశ్ లో అధిక ప్రాణ నష్టం జరిగింది. యూపీలో వర్షాలు, వరదల కారణంగా 191 మంది చనిపోయినట్టు ఎన్ఈఆర్‌సీ నివేదిక చెబుతోంది.
కేరళ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల తర్వాత పశ్చిమబెంగాల్‌లో 183 మంది, మహారాష్ట్రలో 139 మంది, గుజరాత్‌లో 52 మంది, అసోంలో 45 మంది, నాగాలాండ్‌లో 11 మంది ఈ ఏడాది కురిసిన వర్షాలు, వరదల కారణంగా దుర్మరణంపాలైనట్టు నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ తెలిపింది. ఈ ఏడు రాష్ర్టాల్లో మృతుల సంఖ్య ఇలా ఉంటే మరో 274 మంది వర్షాల కారణంగా చోటుచేసుకున్న వివిధ దుర్ఘటనల్లో తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, గాయపడిన వారి సంఖ్య ఇలా ఉండగా వరదల్లో గల్లంతైన 33 మంది ఆచూకీ తెలియరాలేదని ఎన్ఈఆర్‌సీ వెల్లడించింది.