పశుదాణా కుంభకోణం కేసులో దోషిగా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తోన్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కి జార్ఖండ్ హైకోర్టులో చుక్కెదురైంది. రాంచిలోని బిర్సా ముండా జైలులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు రాగా హై కోర్టు అతడి బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించింది. గతేడాది డిసెంబర్ 23 నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ బిర్సా ముండా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదే పశు దాణా కుంభకోణం కేసుకు సంబంధించి దేవ్ ఘర్ ట్రెజరీ నుంచి రూ.89.27 లక్షలు స్వాహా చేశారనే నేరం కింద లాలూ ఈ జైలు శిక్ష ఎదుర్కొంటున్నాడు. పశుదాణా కుంభకోణం కేసులో లాలూకి మొట్టమొదటిసారి 2013లో ఐదేళ్ల జైలు శిక్ష పడగా తర్వాత 2017లో రెండోసారి మూడున్నరేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో ముచ్చటగా మూడోసారి 2018లో లాలూకి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 


ఇదిలావుంటే 2013, సెప్టెంబర్ 30న కోర్టు లాలూకి తొలిసారి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన కారణంగా లాలూ ప్రసాద్ యాదవ్ లోక్ సభ నుంచి అనర్హుడవడంతోపాటు ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయిన సంగతి తెలిసిందే.