మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చితాభస్మాన్ని ఈ రోజు హరిద్వార్‌లో నిమజ్జనం చేశారు. హరి-కి-పౌరి ఘాట్ దగ్గరలోని గంగా జలాల్లో చితాభస్మాన్ని నిమజ్జనం చేయడం జరిగింది. వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత చేతుల మీదుగా ఈ నిమజ్జనం కార్యక్రమం జరిగింది. ఈ రోజు ఉదయమే న్యూఢిల్లీలోని స్మృతి స్థల్ నుండి వాజ్‌పేయి చితాభస్మాన్ని సేకరించి.. డెహ్రాడున్ ప్రాంతానికి ఆయన కుమార్తె నమిత తీసుకొచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నమితతో పాటు ఆమె కుమార్తె నిహారిక కూడా డెహ్రాడున్ వచ్చారు. నిమజ్జనం కార్యక్రమం జరగడానికి ముందు.. హరిద్వార్ ప్రాంతంలో వాజ్‌పేయి  'అస్థి కలశ యాత్ర' కూడా జరిగింది. ఈ యాత్రలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ముందుండి నడిపించారు. ప్రేమ్ ఆశ్రమం వద్ద చేపట్టిన ఈ యాత్ర హర్-కి-పౌరి ఘాట్‌ వరకు కొనసాగింది. 


జీవితాంతం బ్రహ్మచారిగానే గడిపిన వాజ్‌పేయి తన స్నేహితురాలైన రాజ్ కుమారి కౌల్ కుమార్తె నమితా భట్టచార్యను చిన్నప్పుడే దత్తత తీసుకొని.. తన సొంత కూతురిగా పెంచారు. వాజ్‌పేయి పార్థివ దేహానికి ఆయన దత్తపుత్రికే దగ్గరుండి దహన సంస్కారాలు చేశారు.