మాజీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి సత్య ప్రకాష్ మాలవీయ ఆదివారం ఉదయం తెల్లవారుజామున ఒంటిగంటకు ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రోస్టేట్ క్యాన్సర్‌తో గతకొంతకాలంగా బాధపడుతున్న మాలవీయ.. ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మరణించినట్లు పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్ వీకే.దీక్షిత్ ప్రముఖ వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. ఆయనకు ఒక కుమార్తె ఉండగా.. భార్య నాలుగు సంవత్సరాల క్రితమే మరణించారు.


అలహాబాద్ నగరంలోని మాలవీయనగర్‌లో జన్మించిన మాజీ కేంద్ర మంత్రి.. ఎమర్జెన్సీ కాలంలో 18 నెలలు జైలు జీవితం గడిపారు.


మాజీ ప్రధాని చంద్రశేఖర్ నేతృత్వంలోని క్యాబినెట్‌లో మాలవీయ పెట్రోలియం మంత్రిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలో పర్యావరణ మంత్రిగా కూడా పనిచేశారు. ప్రజా సోషలిస్ట్ పార్టీ సభ్యుడిగా మాలవీయ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.


సోమవారం ఉదయం 11 గంటలకు అలహాబాద్‌లో మాలవీయ అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.