ఈ సారి కర్ణాటక ఎన్నికల్లో కొందరు మంచి ఫలితాల కోసం బాబాల వెంట, స్వామీజీల వెంట పడుతుంటే... మరికొందరేమో వాస్తు శాస్త్రాన్ని కూడా బలంగా నమ్మేస్తున్నారు. అందుకు ఉదాహరణే ఈ సంఘటన. చాముండేశ్వరీ నియోజకవర్గానికి చెందిన పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి వచ్చిన జేడీఎస్ ఎమ్మెల్యే జి టి దేవెగౌడ సతీమణి వాస్తు శాస్త్రం ప్రకారం ఈవీఎంను సరైన దిక్కున పెట్టలేదని సిబ్బందితో వాదించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెంటనే ఈవీఎంను ఆ దిక్కు నుండి తొలిగించి వేరే దిక్కున పెట్టాలని కోరారు. సిబ్బంది కూడా ఆమె చెప్పిన ప్రదేశంలోనే ఈవీఎంను పెట్టడంతో ఆమె వాదనకు స్వస్తి చెప్పారు. అయితే ఓటర్ల ఎదుటే ఈ సంఘటన జరగడంతో వారు ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే సతీమణి కావడం వల్లే ఆమె అనుకున్నట్లు జరిగిందని.. ఆమె అలా వాదించడం వల్ల ఆయా ఎమ్మెల్యే హుందాతనం తగ్గిందని.. ఆమె అలా చేసుండాల్సింది కాదని నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. 


ఈ విషయాన్ని పక్కన పెడితే, కర్ణాటకలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండటంతో పోలింగ్‌కు ఆటంకం ఏర్పడుతోంది. షిమోగాలో 31 మంది ఓటు వేసిన తరువాత ఈవీఎంలు మొరాయించాయి. దీనితో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలలో నిలబడి వేచి చూస్తున్నారు. అలానే మాన్వి తాలూకా జక్కలదిన్నిలో పోలింగ్‌ ప్రారంభం కాలేదు. పోలింగ్‌ ప్రారంభం కాని విషయాన్ని పోలింగ్‌ సిబ్బంది అధికారులకు తెలియజేశారు. హుబ్లీలో వీవీప్యాట్ మెషీన్ మొరాయించడంతో పోలింగ్‌ను కొద్దిసేపు ఆపేశారు.