న్యూ ఢిల్లీ: బంగారం ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం నాడు బంగారం ధరలు పెరిగింది కేవలం ఒక్క శాతమే అయినా... తాజా పెంపుతో బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో తాజా పరిణామాలతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. స్పాట్ గోల్డ్ 0.9శాతం పెరిగి ఒక ఔన్స్‌కు 1633.46 డాలర్లకు చేరింది. మార్కెట్ వర్గాల విశ్లేషణ ప్రకారం 2013 ఫిబ్రవరి 14 తర్వాత స్పాట్ గోల్డ్ ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఈ వారం మొత్తంగా బంగారం ధరలు 3% పెరిగాయి. గతేడాది ఆగస్టు తర్వాత ఒక వారంలో బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడం కూడా ఇదే తొలిసారి కానుంది. 


దేశ రాజధాని ఢిల్లీలో నేడు 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.40,660 ఉండగా 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.41,860కి పెరిగింది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధరలు రూ.39,810గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు 43,430 మార్క్‌కి చేరుకుంది. విజయవాడలోనూ బంగారం ఇవే ధరల వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్, విజయవాడల్లో జనవరి 1వ తేదీ నుంచి నేటి వరకు బంగారం ధరలు దాదాపు 4 శాతం పెరిగాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..