స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా త్వరలోనే తమ ఖాతాదారులకి ఓ గుడ్ న్యూస్ వినిపించనుంది. పట్టణాల్లోని శాఖల్లో ఖాతా కలిగి వున్న వారు రూ.3,000 కనీస నగదు నిల్వ కలిగి వుండాలనే నిబంధను సడలించి ఆ మొత్తాన్ని రూ.1,000కి పరిమితం చేయాలని ఎస్‌బీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రూ.3,000 కనీస నగదు నిల్వ విషయంలో ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తుండడంతోనే ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతేడాది ఏప్రిల్-నవంబరు మధ్య కనీస నిల్వను పాటించని ఖాతాదారుల నుంచి రూ.1,772 కోట్లు వసూలు చేసినట్టు ఇటీవల ప్రకటించిన ఎస్‌బీఐ ఉన్నట్టుండి ఈ విషయంపై పునరాలోచనలో పడటం వెనుక ప్రభుత్వం నుంచి ఎదురైన ఒత్తిళ్లే కారణం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎస్‌బీఐ త్వరలోనే తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం వుంది. ఇంతకుముందు ఎస్బీఐ పట్టణ ఖాతాదారులకి రూ.5,000లుగా వున్న కనీస నగదు నిల్వను ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో రూ.3,000లకి తగ్గించింది. సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.2 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000 కనీస నగదు నిల్వ ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతకు మించి తగ్గితే ఆయా ప్రాంతాలను బట్టి జరిమానా కింద  రూ.25 నుంచి రూ.100 వసూలు చేయనున్నట్టు ప్రకటించింది.


2017 జూన్‌లో కనీస నగదు నిల్వను రూ.5 వేలకు పెంచిన ఎస్‌బీఐ.. ఆ తర్వాత ఖాతాదారుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో మెట్రో నగరాల్లో రూ.3,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.2,000 గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000 కి తగ్గిస్తున్నట్టు చేసింది. ఈ కనీస నిల్వలని పాటించకపోతే ఆయా ప్రాంతాలను బట్టి జరిమానా కింద రూ.25 నుంచి రూ.100 వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. ఆ ప్రకారమే గతేడాది ఏప్రిల్-నవంబరు మధ్య కనీస నిల్వను పాటించని ఖాతాదారుల నుంచి రూ.1,772 కోట్లు వసూలు చేసినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.