మృణాళినీ సారాభాయ్.. భారతదేశం గర్వించదగ్గ సాంప్రదాయ నృత్యకళాకారిణి ఆమె. మే 11, 1918 తేదిన కేరళలోని మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు సామాజిక కార్యకర్తైన అమ్ము స్వామినాథన్‌కు జన్మించారు మృణాళినీ సారాభాయ్. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త  విక్రం సారాభాయ్‌ సతీమణి అయిన మృణాళినీ సారాభాయ్ శాంతి నికేతన్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్  ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే సుమారు 300 నాటకాలకు దర్శకత్వం వహించారు. నవలలు, నాటకాలు రాయడంలో కూడా ఆమె అందె వేసిన చేయి. నృత్యశిక్షణ విషయానికి వస్తే దాదాపు18,000 మంది శిష్యులకు భరతనాట్యం మరియు కథాకళి నాట్యాల్లో ఆమె నిష్ణాతులను గావించారు.  దక్షిణాది సాంప్రదాయక నృత్యమైన భరతనాట్యాన్ని "మీనాక్షి సుందరంపిళ్ళై" వద్ద మరియు కథాకళి నృత్యాన్ని "తకఘి కుంచు కురూప్" వద్ద నేర్చుకున్న మృణాళినీ, గుజరాత్ రాష్ట్ర చేనేత పరిశ్రమల అభివృద్ది సంస్థకు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. భారత ప్రభుత్వం 1992లో మృణాళినీ సారాభాయిని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది


1997 లో యు.కెలోని న్యూయాచ్‌కు చెందిన అంగిలియా విశ్వవిద్యాలయం మృణాళినీ సారాభాయ్‌కి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.  1994లో న్యూఢిల్లీలో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని సైతం అందుకుంది. అదేవిధంగా మెక్సికో ప్రభుత్వం నుండి బంగారు పతకాన్ని కూడా పొందింది.


97 సంవత్సరాలు జీవించిన గొప్ప నాట్యకారిణి మృణాళినీ సారాభాయ్ జనవరి 20, 2016 తేదిన పరమపదించారు. నేడు ఆమె జయంతి సందర్భంగా గూగుల్ సంస్థ ఒక ప్రత్యేకమైన ఆర్ట్ (డూడుల్)తో ఆ మహా నాట్యకారిణికి నివాళులు అర్పించింది.